కరోనా బారినపడిన టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి

  • స్వల్ప లక్షణాలే ఉన్నాయన్న కాంగ్రెస్ 
  • ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • సామాజిక వ్యాప్తికి తన కేసే ఉదాహరణ అన్న నారాయణరెడ్డి
తెలంగాణలో మరో నేత కరోనా బారినపడ్డారు. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, త్వరగానే కోలుకుంటారని పేర్కొన్నాయి.

రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తికి తన కేసే ఉదాహరణ అని ఈ సందర్భంగా నారాయణరెడ్డి తెలిపారు. విదేశాలకు కానీ, ఇతర ప్రదేశాలకు కానీ తాను వెళ్లలేదని, కరోనా రోగులను కానీ, వారికి సన్నిహితంగా ఉన్న వారిని కానీ తాను కలవలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు వైరస్ సంక్రమించిందంటే దానర్థం కమ్యూనిటీ వ్యాప్తి జరిగినట్టేనని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైరస్ సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టాలని నారాయణరెడ్డి కోరారు.


More Telugu News