గాల్వన్ లోయలో చైనా నిర్మాణాలకు ప్రయత్నించడమే వివాదాలకు కారణం: కేంద్రమంత్రి జైశంకర్

  • చైనా విదేశాంగ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన జైశంకర్
  • చైనా తీరుపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి
  • జూన్ 6 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తుది నిర్ణయం
గత కొన్నిరోజులుగా లడఖ్ వద్ద గాల్వన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రాణనష్టానికి దారితీశాయి. అయితే ఈ ఉద్రిక్తతలకు కారణమేంటో ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. తాజాగా, ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు. ఘర్షణల పట్ల తన నిరసన వ్యక్తం చేశారు. గాల్వన్ లోయలో చైనా నిర్మాణాలకు ప్రయత్నించడమే వివాదాలకు కారణం అని ఆరోపించారు. హింసకు దారితీసేలా ప్రణాళిక ప్రకారం చైనా వ్యవహరించిందని విమర్శించారు. సరిహద్దులకు సంబంధించి అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని జైశంకర్ చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీకి స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశం చైనాలో కనిపిస్తోందని ఆరోపించారు. జూన్ 6న సైనిక కమాండర్ల స్థాయిలో బలగాల ఉపసంహరణ నిర్ణయం జరిగిందని, దీనికి సంబంధించి సైనికులు ద్వైపాక్షిక నియమావళి, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. కానీ చైనా సైనికులు ఘర్షణకు దిగారని, ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. చైనా తనవైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించుకోవాలని హితవు పలికారు.

అటు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా తమ నిర్ణయాలు, విధానాలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు వివరించారు. సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత...  జూన్ 6 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరుదేశాలు తుది నిర్ణయం తీసుకున్నాయి. శాంతి సాధన దిశగా కలిసి కృషి చేయాలని విదేశాంగ మంత్రులు తీర్మానించారు.


More Telugu News