దేశ రక్షణ విషయంలో రాజీపడాల్సిన అవసరంలేదు: సీఎం కేసీఆర్
- సీఎంలతో ప్రధాన మోదీ వీడియో కాన్ఫరెన్స్
- చైనాతో సరిహద్దు ఘర్షణలపై స్పందించిన సీఎం కేసీఆర్
- దేశ రక్షణ విషయంలో రాజకీయాలు అవసరంలేదని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చైనాతో సరిహద్దు ఘర్షణలపై స్పందించారు. దేశ రక్షణ అంశంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరంలేదని, ఈ విషయంలో కేంద్రానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కేంద్రం వెంటే ఉంటారని స్పష్టం చేశారు. చైనా కావొచ్చు, మరే ఇతర దేశమైనా కావొచ్చు... భారత సార్వభౌమత్వం విషయంలో జోక్యం చేసుకుంటే దీటుగా బదులివ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడాల్సిన అవసరంలేదని అన్నారు. దేశమంతా ఐకమత్యంతో నిలవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.