మహానదిలో మునిగిపోయిన 500 ఏళ్లనాటి పురాతన ఆలయం గుర్తింపు

  • 1993 వరదల్లో మునిగిపోయిన ఆలయం
  • మహానది దిశ మార్చుకోవడంతో గ్రామం మొత్తం మునిగిపోయిన వైనం
  • ఈ ప్రాంతంలో మరో 65 దేవాలయాలు నీట మునిగాయన్న పురావస్తు అధికారులు
500 ఏళ్ల పురాతనమైనదిగా భావిస్తున్న ఓ దేవాలయం ఒడిశాలోని మహానదిలో బయటపడింది. 1933 వరదల్లో ఈ ఆలయం మునిగిపోయింది. 90 ఏళ్ల క్రితం భారీ వరదల వల్ల మహానది తన దిశను మార్చుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో నయాఘర్ సమీపంలో ఉన్న ఆలయంతో పాటు మొత్తం గ్రామం మునిగిపోయింది. ఆలయానికి సంబంధించి పైభాగం కొంచెం బయటపడడంతో... గుడిని గుర్తించినట్టు 'ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్టీఏసీహెచ్)' కు చెందిన పురావస్తు సర్వే బృందం తెలిపింది.

'ఈ దేవాలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. 450 నుంచి 500 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహాన్ని మరో ఆలయానికి తరలించారు. మహానది లోయ ప్రాంతంపై మేము ప్రాజెక్ట్, డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ ఆలయం గురించి వెతికాం. ఆలయం పైభాగం కనిపిస్తోందంటూ వారం క్రితం మాకు సమాచారం వచ్చింది' అని ఐఎన్టీఏసీహెచ్ చీఫ్ అనిల్ కుమార్ ధీర్ తెలిపారు.

ఈ ఆలయంలోని విగ్రహం విష్ణు అవతారమైన గోపీనాథ్ ది అయి ఉంటుందని అనిల్ కుమార్ చెప్పారు. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం దేవాలయం మునిగిపోయినప్పటికీ... ఇప్పటికీ మంచి కండిషన్ లోనే ఉందని తెలిపారు. ఈ ఆలయాన్ని మరోచోట ఏర్పాటు చేస్తామని... ఆ టెక్నాలజీ తమ వద్ద ఉందని చెప్పారు. మునిగిపోయిన ఆలయాన్ని తాము గుర్తించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 65 దేవాలయాలు నీట మునిగాయని... వీటిలో ఈ దేవాలయం అత్యంత ఎత్తైనదని చెప్పారు.

మరోవైపు స్థానికులు మాట్లాడుతూ, నీటి మట్టం కంటే ఎత్తులో 11 ఏళ్ల క్రితం తొలిసారి దేవాలయం పైభాగం కనిపించిందని చెప్పారు. అప్పటి నుంచి రీసర్చర్లు దాన్ని ట్రాక్ చేస్తున్నారని తెలిపారు. పురాతన ఆలయం బయటపడటంతో... దాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారు. దీంతో, లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కొంత సందడి నెలకొంది.


More Telugu News