తుపాకులు వాడకుండా... ప్రాణాలు తీసే ఆయుధాలు తయారు చేసుకుని తెచ్చిన చైనా జవాన్లు!

  • పక్కా ప్లాన్ తో దాడికి దిగిన చైనా
  • ముళ్ల తీగలు చుట్టిన వెదురు బొంగులు తెచ్చి దాడి
  • నిరాయుధులుగా ఉన్న భారత సైన్యంపై దాడి
'సరిహద్దుల్లో తుపాకులు పేలలేదు. కేవలం రాళ్లదాడి మాత్రమే జరిగింది. 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు' అన్న ఆర్మీ అధికారుల ప్రకటన నమ్మశక్యంగా లేదని పలువురు భారతీయులు అభిప్రాయపడుతున్న వేళ, అసలు లడక్ సమీపంలోని సరిహద్దుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు తెలియజేశారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు, వందల మంది చైనా జవాన్లు సరిహద్దులను దాటి, భారత భూ భాగంలోకి వస్తున్న వేళ, మన సైన్యం వారిని నిలువరించింది.

అప్పటికే భారత సైన్యంపై దాడి చేయాలన్న ఆలోచనలో ఉన్న చైనా సైనికులు, భారీ ఎత్తున రాళ్లు, ఇనుప రాడ్లు, ముళ్ల తీగలు చుట్టిన వెదురు బొంగులను సిద్ధం చేసుకుని, వాటితో దాడికి దిగారు. చైనా జవాన్లు విచక్షణారహితంగా దాడికి దిగారు. భారత సైనికులపై రాళ్లు రువ్వారు. వెదురు బొంగులకు చుట్టిన ఇనుప తీగలు భారీ నష్టాన్ని కలిగించాయి. వాటితో దాడి చేయడం వల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది. ఆ సమయంలో భారత సైనికులు నిరాయుధులుగా ఉన్నారు. వారు తేరుకుని ప్రతిదాడికి దిగి దీటైన సమాధానాన్ని ఇచ్చారు.

దీని ఫలితంగానే చైనా సైనికులు కూడా పెద్దఎత్తున మృత్యువాతపడ్డారు. మృతి చెందిన చైనా సైనికులను హుటాహుటిన అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా తరలించారు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు, గాయపడిన వారిని తరలించేందుకు దాదాపు 7 హెలికాప్టర్లను చైనా వినియోగించినట్టు సమాచారం.


More Telugu News