అద్దాన్ని చూడకుండా పరుగెత్తి... బ్యాంకులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి!

  • కేరళలోని పెరంబువూరులో ఘటన
  • అద్దం పగిలి కడుపులో గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి
ఓ బ్యాంకుకి వున్న గ్లాస్ డోర్ (అడ్డం తలుపు)ను గమనించకుండా వేగంగా వెళ్లిన ఓ యువతి, అది తగిలి గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అక్కడ ఏమీ లేదనుకుని భావించి వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పెరంబువూరులోని ఓ బ్యాంకులోకి వెళ్లిన బీనా పౌల్ (40), అక్కడి ఉద్యోగి ఏదో డాక్యుమెంట్ కావాలని అడిగేసరికి, వేగంగా, బయట ఉన్న తన కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె తలుపుగా ఉన్న అద్దాన్ని గమనించలేదు.  

బీనా పౌల్ ప్రమాదవశాత్తూ, అద్దాన్ని బలంగా ఢీకొనగా, ఆమె కడుపులో గాయమైంది. ఆ వెంటనే   ఆమె కుప్పకూలిపోయింది. ఆమె తలకు కూడా గాయాలు అయ్యాయి. గ్లాస్ డోర్ కు తగిలి కిందపడిన తరువాత, లేచిన ఆమె, తన కడుపును పట్టుకుని విలవిల్లాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతర్గత గాయాల కారణంగానే బీనా మరణించారని పెరంబవూరు పోలీసు అధికారి సి.జయకుమార్ వెల్లడించారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకులో ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నారని, వారు ఆమెకు సాయం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. బీనాను సమీపంలోని ఆసుపత్రికి తక్షణమే తరలించారని, కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయామని తెలిపారు. 


More Telugu News