ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రం ఢిల్లీలో... 22 ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణం!

  • కరోనా చికిత్సకు రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ 
  • 10 వేల బెడ్లతో చికిత్సా కేంద్రం
  • నిత్యమూ శానిటైజ్ చేసే అవసరం లేకుండా బెడ్లు
కరోనా చికిత్సలో ఇండియా మరో రికార్డును నెలకొల్పనుంది. దేశ రాజధానిలో దాదాపు 22 ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణంలో భారీ చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పనుంది. దక్షిణ ఢిల్లీలోని రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రంగా దాదాపు 10 వేల బెడ్లతో మార్చనున్నారు. ఇక్కడ నిత్యమూ శానిజైట్ చేయాల్సిన అవసరం ఉండక పోవడం విశేషం.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కరోనా సెంటర్ గా మార్చాలని నిర్ణయించింది. ఇక ఇక్కడి ప్రత్యేకతలు ఏంటంటే, ఇక్కడన్నీ కార్డ్ బోర్డ్ బెడ్స్ ఉంటాయి. వీటిని రీసైకిల్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ బోర్డ్ పై వైరస్ 24 గంటల కన్నా నిలిచివుండే అవకాశాలు లేవు కాబట్టి, వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇవి బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి, వీటిని సులువుగా ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లవచ్చని వీటిని తయారు చేసిన ధావన్ బాక్స్ షీట్ కంటెయినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విక్రమ్ ధావన్ వెల్లడించారు.

ఛత్తార్ పూర్ లో రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. ఇది దాదాపు 12.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ జరిగే సమావేశాలకు సుమారు 3 లక్షల మందికిపైగా హాజరవుతుంటారు. ఇక్కడి అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చబడి వున్నాయి. దీంతో కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఈ సెంటర్ ను సులువుగా మార్చవచ్చని ఢిల్లీ సర్కారు భావించింది.

లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత, ఈ కేంద్రంలో వలస కార్మికులకు ఆశ్రయం కల్పించారు. ఇక్కడ సామూహికంగా వంటకాలు చేసి, ఎంత మందికైనా వడ్డించే సదుపాయాలున్నాయని రాధా సోమీ సత్సంగ్ బియాస్ కార్యదర్శి వాకాస్ సేథీ వెల్లడించారు. ఇక, ఈ కేంద్రాన్ని సందర్శించిన దక్షిణ ఢిల్లీ జిల్లా కలెక్టర్ బీఎం మిశ్రా, ఇక్కడి ఏర్పాట్లు చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 

ఒక్కొక్కటీ 500 బెడ్లను కలిగివున్న 20 ఆసుపత్రులు చేసే చికిత్సలను ఇక్కడ నిర్వహించవచ్చని అన్నారు. ఇక్కడ రెండు షిఫ్ట్ లలో 400 మంది డాక్టర్లు పని చేయాల్సి వుంటుందని ఆయన తెలిపారు. అత్యాధునిక ఆసుపత్రుల్లో కల్పించే సౌకర్యాలనన్నింటినీ ఇక్కడ కల్పించే వీలుందని, కంప్యూటర్లను సైతం ఇన్ స్టాల్ చేస్తున్నామని తెలిపారు. మిలిటరీ, పారా మిలిటరీ బలగాలు ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని, సెంటర్ నిర్వహణ, లాజిస్టిక్స్, వైద్య పరికరాలు, శానిటేషన్ వర్కర్లను కేటాయించనున్నామని తెలిపారు. జూన్ 30 నాటికి ఈ సెంటర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.


More Telugu News