కరణ్ జొహార్ ను విమర్శించడం హాస్యాస్పదం: సుశాంత్ ఆత్మహత్యపై వర్మ స్పందన

  • ఎవరితో కలిసి పని చేయాలనేది నిర్మాత ఇష్టం
  • సుశాంత్ తో పని చేయడమనేది కరణ్ ఇష్టం
  • బంధుప్రీతి లేనిది ఎక్కడ?
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. టాలెంట్ ఉన్న వాళ్లను కూడా తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 6 నెలల్లో సుశాంత్ ను 7 సినిమాల నుంచి తొలగించారనే చేదు నిజం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ వంటి సినీ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

'జరిగిన దానికి కరణ్ జొహార్ ను విమర్శించడం హాస్యాస్పదం. సినీ పరిశ్రమ ఎలా నడుస్తుందో తెలియక విమర్శిస్తున్నారు. సుశాంత్ తో ఇబ్బంది ఉన్నప్పుడు... అతనితో పని చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం.

డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వెలుపలి వ్యక్తిగా సుశాంత్ ఫీల్ అయి సూసైడ్ చేసుకున్నాడని అనుకున్నట్టైతే... సుశాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి. నీకున్న దానితో నీవు సంతోషంగా లేనప్పుడు... నీకు ఎంత ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేవు.  

ములాయం, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయవేత్తలు తమ కుమారులు, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు... ముఖేశ్, అనిల్ కు ధీరూబాయ్ అంబానీ డబ్బు ఇచ్చినట్టు... అన్ని కుటుంబాలు తమ సొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు...  బాలీవుడ్ కుటుంబాలు కూడా వారి సొంత వ్యక్తులకు అదే ప్రాధాన్యతను ఇచ్చాయి. బంధుప్రీతి లేనిది ఎక్కడ?' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.


More Telugu News