మృతదేహాల అప్పగింత విషయంలో కరోనా రిపోర్టుల కోసం చూడకండి: అమిత్ షా ఆదేశాలు

  • మృతదేహాలను బంధువులకు అప్పగించండి
  • అంత్యక్రియలను మాత్రం పరీక్షించండి
  • అధికారులకు హోమ్ మంత్రి ఆదేశాలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో మృతుల కరోనా రిపోర్టులు వచ్చేంతవరకూ ఆగవద్దని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఎవరైనా మరణిస్తే, వారు వైరస్ అనుమానితులు అయినా, వారి మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో అంత్యక్రియలను అధికారులు పర్యవేక్షించాలని, అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ప్రొటోకాల్ ప్రకారం క్రతువును ముగించాలని సూచించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్ షా ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 40 వేలను దాటిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య కూడా రోజుకు సరాసరిన 50 దాటుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాల అప్పగింత, అంత్యక్రియల విషయంలో నెలకొన్న సందేహాలను అమిత్ షా తీర్చారు.

ప్రస్తుతం కరోనా రిపోర్టులు వచ్చేంత వరకూ మృతదేహాలను దాచి పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, దానిపై అమిత్ షా స్పష్టతనిచ్చారు. కాగా, ఇండియాలో ఇప్పటికి 3.32 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.


More Telugu News