తనలోని మరో కోణాన్ని చూపిన రష్మిక... ఆమె రాసిన షార్ట్ స్టోరీ ఇది!

  • లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన రష్మిక
  • ఓ కథ రాసి, ఫొటో షూట్ చేసిన రష్మిక
  • వైరల్ అవుతున్న షార్ట్ స్టోరీ
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అందాల భామ రష్మిక, ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె, ఇప్పుడు తన ఫ్యాన్స్ కోసం ఓ కథ రాసింది. ఆ కథకు అవసరమైన ఫొటో షూట్ ను చేసి పోస్ట్ చేసింది. నీలి రంగు చీరలో రష్మిక మెరిసిపోతోందని ఫ్యాన్స్ కితాబునిస్తున్నారు. ఇక ఆమె రాసిన కథలోకి వెళితే...

"అగ్ని మహల్ మెట్ల మీద నీలి రంగు చీర కట్టుకుని కూర్చుని ఉన్న మైరాపై శీతాకాలపు సూర్యుడి కాంతి ప్రసరిస్తోంది. ఆమె మహల్ రాతి మెట్లపై ఆసీనురాలైన వేళ, మహల్ పనివాళ్లు, తమ రోజువారీ పనులను చేసుకుంటూ చకచకా కదులుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అగ్ని మహల్ గురించి ఎన్నో కథలను విన్న ఆమెకు ఈ పురాతన తలుపులు ఎల్లప్పుడూ తెరచుకోబడి ఆహ్వానాన్ని పలుకుతూనే ఉంటాయి.

ప్రతి ఉదయమూ సూర్య కాంతి, ఓ ద్రవ్యరాశిలా మహల్ లోని శిల్పాలపై పడి వాటికి అభ్యంగన స్నానం చేయిస్తుంటుంది. నిత్యమూ మైరా నీలి రంగు చీరలోనే పక్షుల కిలకిలారావాల మధ్య అక్కడ పనిచేసే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తన కోరిక నెరవేరే క్షణాల కోసం వేచి చూస్తోంది. మహల్ మెట్లపై కూర్చుని నెలల తరబడి వేచి చూసిన మైరా కోరిక తీరే సమయం ఆసన్నమైంది.

కానీ ఆమె లావణ్యం కింద దాగిన నిశ్శబ్ద హృదయ వేదన, తలుపులు మరియు కిటికీల గుండా ప్రవహించే ప్రకాశవంతమైన సూర్యకాంతికి చాలా భిన్నంగా ఉంది. తన నిరీక్షణ ఫలించే రోజు వచ్చిందని ఆమె హృదయం ఆరాటపడుతోంది" అంటూ తనలోని భావాలను ఆమె కాగితంపై పెట్టింది. రష్మిక పెట్టిన ఈ పోస్ట్ లో సదరు మహల్, కొందరు పనివారు, మెట్లపై నీలి రంగు చీరలో అప్సరసలా మెరుస్తున్న రష్మిక కూడా ఉన్నారు. అదిప్పుడు వైరల్ అవుతోంది.


More Telugu News