క్యాబినెట్ భేటీ నిర్వహించలేని ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహిస్తుందంట!: అనగాని సత్యప్రసాద్

  • పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్
  • విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం
  • తెలంగాణ మాదిరే ఏపీలోనూ రద్దు చేయాలన్న అనగాని
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న క్రమంలో అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాయి. ఏపీకి అటూ ఇటూ ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులను పై క్లాసులకు నేరుగా ప్రమోట్ చేశాయి. అయితే ఏపీలో మాత్రం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్కారు సమాయత్తం అవుతోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. సరిగా క్యాబినెట్ సమావేశమే నిర్వహించడం చేతకాని ఈ ప్రభుత్వం టెన్త్ పరీక్షలు ఎలా నిర్వహించగలదని ఎద్దేవా చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని, లాక్ డౌన్ పరిస్థితుల్లో పది పరీక్షల అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

ఏపీలో నిత్యం వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే, పరీక్షల పేరిట విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయంతో సీఎం జగన్ తాడేపల్లి రాజభవనం నుంచి బయటికి రావడంలేదని, మంత్రులు నియోజకవర్గం దాటి ఇవతలికి అడుగుపెట్టడంలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎలా బయటికి వస్తారని అనగాని ప్రశ్నించారు. తెలంగాణ తరహాలోనే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News