కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి చేతిలో రూ. 8 కోట్ల బిల్లు పెట్టిన హాస్పిటల్!

  • మార్చి 4న కరోనా హాస్పిటల్ లో చేరిన మైఖేల్
  • 62 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్
  • 181 పేజీల బిల్ వేసిన వైద్యులు
కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నానన్న ఆనందం ఆ వ్యక్తికి ఏ మాత్రమూ కలుగనివ్వలేదు ఓ హాస్పిటల్. దాదాపు 62 రోజుల పాటు చికిత్స చేసి, 70 ఏళ్ల వృద్ధుడిని వ్యాధి బారి నుంచి కాపాడిన వైద్యులు, ఏకంగా 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8 కోట్లు) బిల్ ఇచ్చారు. ఈ ఘటన వాషింగ్టన్ లో జరిగింది. 'ది సియాటెల్ టైమ్స్' వెల్లడించిన కథనం ప్రకారం, మైఖేల్ అనే వ్యక్తి, మార్చి 4న నగరంలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరగా, అతనికి కరోనా సోకిందని నిర్దారించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు.

ఈ మధ్యలో ఓ మారు మృత్యువు అంచు వరకూ వెళ్లొచ్చాడు మైఖేల్. ఆ సమయంలో హాస్పిటల్ స్టాఫ్, ఓ ఫోన్ చేసి, తన భార్యా పిల్లలతో ఆఖరి సారి మాట్లాడుకోవాలని కూడా సూచించగా, ఆయన కన్నీటితో గుడ్ బై కూడా చెప్పాడు. ఆపై వైద్యుల శ్రమ ఫలించింది. అతను కోలుకుని మే 5న డిశ్చార్జ్ అయ్యాడు.

ఇక అతనికి హాస్పిటల్ యాజమాన్యం 181 పేజీల బిల్లును ఇచ్చింది.  42 రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేసినందుకు రోజుకు 9,736 డాలర్ల చొప్పున, 29 రోజులు వెంటిలేషన్ పై ఉంచినందుకు రోజుకు  82 వేల డాలర్ల చొప్పున, మరో రెండు రోజులకు రోజుకు లక్ష డాలర్ల చొప్పున  బిల్ వేసింది. ఇతర ఖర్చులతో కలిపి మొత్తం 1,122,501.04 డాలర్లు కట్టాలని ఆదేశించింది. అయితే, అమెరికాలో వృద్ధుల ఆరోగ్య బీమా పథకం మైఖేల్ కు వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని అతను తన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.


More Telugu News