మరో లాక్ డౌన్... మంత్రులతో నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష!

  • ఇండియాలో పెరిగిపోతున్న కరోనా కేసులు
  • మరో సంపూర్ణ లాక్ డౌన్ పై చర్చ
  • మోదీతో సమావేశంలో అమిత్ షా, హర్షవర్ధన్ తదితరులు
ఒకవైపు ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండగా, మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, తన మంత్రివర్గ సహచరులతో నిన్న అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు.

దేశంలో మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చినట్టు పీఎంఓ వర్గాల సమాచారం. అయితే, కేసులు అత్యధికంగా ఐదు రాష్ట్రాల నుంచే వస్తున్నందున, ఆ రాష్ట్రాల్లో మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, మిగతా రాష్ట్రాలను మినహాయించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చిందని తెలుస్తోంది.

మరోసారి లాక్ డౌన్ విధించే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  నేడు దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ లతో అమిత్ షా భేటీ కావాలని, వాస్తవ స్థితిగతులను సమీక్షించాలని మోదీ ఆదేశించారు. ఆపై ఈ నెల 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై, అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News