ఇది సమంజసం కాదు.. ఇది ఉల్లంఘనే!: నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్

  • భారత్ లోని కొన్ని ప్రాంతాలను తనవిగా పేర్కొంటున్న నేపాల్
  • కొత్త ప్రాంతాలను కలుపుకుని సరికొత్త మ్యాప్ కు రూపకల్పన
  • నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మ్యాప్ కు ఆమోదం
భారత్ లోని లిపులేఖా, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తనవిగా పేర్కొంటూ నేపాల్ సరికొత్త మ్యాప్ కు రూపకల్పన చేయడమే కాదు, తాజాగా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో ఆమోదముద్ర వేయించుకుంది. దీనిపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, నేపాల్ మ్యాప్ విస్తరణకు చారిత్రక నిదర్శనాలు కానీ, ఇతర ఆధారాలు కానీ లేవని, ఇది సమంజసం కాదని స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న విధానాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

భారత్ ప్రాదేశిక భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తనవిగా చూపించుకుంటూ రూపొందించిన మ్యాప్ కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు నేపాల్ చట్టసభలో ఆమోదం లభించిన విషయం తమకు తెలిసిందని, ఈ విషయంలో తమ వైఖరి ఇప్పటికే నేపాల్ కు తెలియజేశామని వెల్లడించారు.

గత నెలలో 8వ తేదీన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత్-నేపాల్ సరిహద్దుల్లో లిపులేఖ్ ప్రాంతాన్ని దర్చూలా ప్రాంతంతో కలిపే 80 కిలోమీటర్ల రోడ్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ చర్య నేపాల్ ను అసంతృప్తి గురిచేయగా, అప్పటి నుంచే మ్యాప్ సవరణలు చేస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది.


More Telugu News