అచ్చెన్నాయుడు అరెస్టును బీజేపీ స్వాగతిస్తోంది: కన్నా

  • చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యలు
  • తప్పు ఎవరు చేసినా చట్టప్రకారం విచారణ జరగాలన్న కన్నా
  • తప్పు చేయకపోతే భయం ఎందుకుని టీడీపీకి ప్రశ్న
టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో స్పందించారు. అచ్చెన్నాయుడు అవినీతి కేసుల్లో అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరు తప్పు చేసినా వారిపై చట్టప్రకారం విచారణ జరగాలని పేర్కొన్నారు. తమ పాలనలో అంతా పారదర్శకంగానే జరిగిందని గొప్పలు చెప్పుకున్న టీడీపీ ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను అక్రమమని ఘోషిస్తోందని తెలిపారు. తప్పు చేయకపోతే భయం ఎందుకు అని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని ఎన్నికల ముందు జగన్ ప్రజలకు వాగ్దానం చేశారని, కానీ జగన్ వచ్చాక పెద్ద కుంభకోణాల విషయంలో నోరు మెదపడంలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు, కమిషన్ వేశారు, అయినా ఇప్పటికీ విచారణ జరగలేదని కన్నా ఆరోపించారు. ఇక, పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ, వైసీపీల వ్యవహారం దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఉందని విమర్శించారు.


More Telugu News