భక్తుల ప్రవేశంపై చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రకటన!

  • భక్తులను ఇంకా అనుమతించలేదు
  • స్వామి వారికి అనునిత్యం అన్ని పూజలు జరుగుతున్నాయి
  • భక్తులను అనుమతించడంపై త్వరలోనే ప్రకటిస్తాం
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పలు సడలింపులు ఇచ్చాయి. సడలింపుల్లో ప్రార్థనాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకు ప్రజలకు అనుమతిని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు సమీపంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము ఇంకా భక్తులను అనుమతించ లేదని తెలిపింది.

ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈ ఉదయం మాట్లాడుతూ, భక్తులను తాము ఇంకా అనుమతించలేదని చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో కూడా స్వామివారికి ఏకాంత పూజలు, ఏకాంత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆరాధన తదితర కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగాయని చెప్పారు. కరోనా వైరస్ అంతం కావాలంటూ స్వామి వారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.


More Telugu News