అచ్చెన్నాయుడి అరెస్ట్ అక్రమం అంటున్నారే తప్ప అవినీతి జరగలేదని మాత్రం ఎవరూ అనడంలేదు!: బొత్స

  • అచ్చెన్న అరెస్ట్ అక్రమం అనడం సరికాదని హితవు
  • అన్ని ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయని వెల్లడి
  • ఇకపై రోజూ ఏదో ఒకటి బయటికొస్తుందని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఘటన టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అచ్చెన్న అరెస్ట్ అన్యాయం అంటూ టీడీపీ నేతలు ఎలుగెత్తుతుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ నేతలు అచ్చెన్న అరెస్ట్ ను అక్రమం అంటున్నారే తప్ప, అవినీతి జరగలేదని ఎవరూ అనడంలేదని అన్నారు. చంద్రబాబు నుంచి ఇతర నేతల వరకు అందరూ ఇదే మాట అంటున్నారని వెల్లడించారు.

అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేశారనడం తగదని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే అదుపులోకి తీసుకోవడం జరిగిందని బొత్స స్పష్టం చేశారు. అచ్చెన్న హయాంలో అక్రమాలు జరిగినట్టు తేలిందని, 130 శాతం అదనపు ధరతో కొనుగోళ్లు జరిగినట్టు ఏసీబీ గుర్తించిందని వివరించారు. ఇదే విషయాన్ని ఏసీబీ జేడీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారని తెలిపారు.

"ఆరోపణలు రాగానే దమ్ముంటే ఎంక్వైరీ చేయాలని మీరే అన్నారు. మీరు చెప్పినట్టే ఎంక్వైరీ చేశాం. అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒకవేళ ఇది అడ్డగోలు అరెస్ట్ అయితే న్యాయస్థానాలు ఉన్నాయి కదా... అక్కడికి వెళ్లండి. ఇక రోజూ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీ ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ వస్తూనే ఉంటాయి. ఒకటీ రెండు కాదు లెక్కలేనన్ని అక్రమాలు చేశారు" అంటూ విమర్శలు గుప్పించారు.

ప్రతిదానికి కులం ఆపాదించడం ఎక్కువైపోయిందని, అరెస్ట్ చేయగానే బలహీనవర్గం వాడని అంటున్నారని ఆరోపించారు. ఆనాడు తనపైనా చంద్రబాబు అడ్డదిడ్డమైన ఆరోపణలు చేశారని, తాను తప్పు చేయలేదు కాబట్టి  సీబీఐ విచారణకు కూడా వెరవలేదని బొత్స స్పష్టం చేశారు.  అప్పుడు నేను బీసీ అని మీకు గుర్తు రాలేదా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.


More Telugu News