సోనూ సూద్ ఇంటికి వేల ఉత్తరాలు... అన్నింటా ఒకటే మాట!

  • కరోనా కష్టకాలంలో ఇక్కట్లపాలైన వలసజీవులు
  • వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించిన సోనూ సూద్
  • ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించిన కేంద్ర పారా నౌజవాన్ యూనియన్
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు. లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన వేలమంది వలస కార్మికులను సోనూ సూద్ సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు చేర్చాడు. అందుకోసం బస్సులు, రైళ్లే కాదు విమానాలను సైతం అద్దెకు తీసుకున్నాడు. కరోనా కష్టకాలంలో అసలు స్వస్థలాలకు చేరుకోగలమా అని తీవ్ర భయాందోళనలకు గురైన వలసజీవులకు ఆపన్నహస్తం అందించాడు. ముఖ్యంగా కేరళలో చిక్కుకుపోయిన వందలాంది మంది ఒడిశా మహిళల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆపద్బాంధవుడే అయ్యాడు.

ఈ నేపథ్యంలో సోనూ గొప్పదనాన్ని గుర్తిస్తూ ఒడిశాకు చెందిన 'కేంద్ర పారా నౌజవాన్ యూనియన్' కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సోనూ సూద్ కు 11 వేల ఉత్తరాలు పంపాలని నిర్ణయించింది. ఈ పోస్టు కార్డులన్నింటిలోనూ "థాంక్యూ సోనూ" అని మాత్రమే పేర్కొనడం ఆయన పట్ల ప్రజల్లో ఉన్న కృతజ్ఞతా భావానికి నిదర్శనం అని చెప్పాలి. ఈ ఉత్తరాలన్నింటినీ ముంబయిలోని అంధేరి వెస్ట్ యమునా నగర్ లో ఉన్న సోనూ సూద్ ఇంటికి పంపిస్తామని కేంద్ర పారా నౌజవాన్ యూనియన్ అధ్యక్షుడు వెల్లడించారు.


More Telugu News