ఇదేనా మా బాబాయ్‌ అచ్చెన్నాయుడు చేసిన తప్పు?: రామ్మోహన్‌ నాయుడి ఆగ్రహం

  • ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారు
  • అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్ర‌జల ధైర్యం మా బాబాయ్
  • బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డమే త‌ప్పా?
  • అచ్చెన్న‌ని ఎదుర్కొనే స‌త్తా మీ 151 ఎమ్మెల్యేల‌కూ లేదా? 
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగారు. ప్రతి రాష్ట్రం కంటే తక్కువ ధరతో ఏపీలో గతంలో మందులు కొనుగోలు చేశామని వివరించారు.

సెక్షన్ అధికారి నుంచి ఒక్కొక్కరిని విచారిస్తూ చర్యలు తీసుకోవాలని, అంతేగానీ, ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని అన్నారు. ఇచ్చిన హామీల్లో వైసీపీ నేతలు ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని విమర్శించారు. హామీలను అమలు చేయకపోవడమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలను వైసీపీ రద్దు చేసిందని చెప్పారు.
 
ఇదే విషయంపై ట్విట్టర్‌లోనూ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... 'అసెంబ్లీలో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్ర‌జల ధైర్యం మా బాబాయ్ అచ్చెన్నాయుడు.  ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డమే మా బాబాయ్ చేసిన త‌ప్పా? అణ‌చివేత‌కు గురైన బీసీ వ‌ర్గాల గొంతుక‌గా త‌న గ‌ళాన్ని వినిపిస్తున్న అచ్చెన్న‌ని స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా మీ 151 ఎమ్మెల్యేల‌కూ లేదా? టీడీఎల్పీ ఉప‌నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేట‌ప్పుడు క‌నీస చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌హ‌రించ‌డ‌మైనా చేత‌కాదా? బీసీ నేత‌ల‌కిచ్చే గౌర‌వం ఇదేనా? అస‌లు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది  ఏసీబీనా? ‌లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా?' అని ప్రశ్నించారు.


More Telugu News