అన్ని ఆధారాలతోనే ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ లు: ఏసీబీ జేడీ రవి కుమార్ స్పష్టీకరణ

  • ముఖ్య కార్యదర్శికి తెలియకుండా కాంట్రాక్టులు
  • మంత్రి సమక్షంలోనే ఫైళ్లు ఫైనలైజ్
  • రూ. 150 కోట్లకు పైగా అక్రమాలు
  • మీడియాకు వెల్లడించిన రవికుమార్
తాము అన్ని ఆధారాలనూ పరిశీలించిన తరువాతనే ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామని విశాఖ రేంజ్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో ఇంతవరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నియమ నిబంధనలను ఉల్లంఘించి మార్కెట్ ధరకన్నా ఎక్కువకు మందులు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు నష్టం కలిగించారన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

నామినేషన్ విధానంలో టెండర్లను కేటాయించిన గత ప్రభుత్వంలోని అధికారులు, మంత్రి, అధిక ధరలకు మందులను కొన్నారని తెలిపారు. ఈ కేసులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు జీకే రమేశ్ కుమార్, విజయ్ కుమార్ లను ను అరెస్ట్ చేశామని, వీరిని విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం తరువాత ప్రవేశపెడతామని తెలిపారు. రూ. 988 కోట్ల కొనుగోళ్లలో రూ. 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనున్నట్టు తెలిపారు.

బినామీ పేర్లతో రమేశ్ కుమార్, తన బంధువులను రంగంలోకి దించి, వారి పేరిట మందులను కొనుగోలు చేశారని రవి కుమార్ తెలియజేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీకి తెలియకుండానే మంత్రి సమక్షంలోనే ఫైళ్లు తయారయ్యాయనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.  అన్ని రకాల పరికరాలనూ మార్కెట్ ధరకన్నా చాలా అధికంగా కొన్నారని తెలిపారు. మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ పరికరాల కొనుగోళ్లకు 150 శాతం వరకూ అధిక ధర వెచ్చించారని తెలిపారు.


More Telugu News