ఏసీబీ పూర్తిగా జగన్‌ డైరెక్షన్‌లోనే పని చేస్తోంది!: యనమల ఫైర్

  • బీసీ నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అరెస్టు: యనమల
  • అరెస్టు చేయడం చాలా‌ దుర్మార్గం: జవహర్
  • రాజకీయ కుట్రలో భాగమే: ధూళిపాళ్ల నరేంద్ర
టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకే సీఎం జగన్‌ కక్షగట్టి ఆయనపై పలు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఆయనపై కుట్రపూరితంగానే అభియోగం మోపారని, ఏసీబీ పూర్తిగా జగన్‌ డైరెక్షన్‌లోనే పని చేస్తోందని ఆయన విమర్శించారు.

తమ పార్టీ నేత అచ్చెన్నాయుడి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని ఆయన చెప్పారు. ఆయనపై ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు లేవని, ఆయనను అరెస్టు చేసినప్పుడు కనీసం ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడమేంటని నిలదీశారు.
 
కాగా, అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం చాలా‌ దుర్మార్గమైన చర్యని టీడీపీ నేత జవహర్ అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించకుండా ఉండడానికే ఆయనను అరెస్టు చేశారని జవహర్‌ అన్నారు. ప్రశ్నిస్తోన్న వారిపై ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పారు.

అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. బలమైన నాయకులని ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలనే కుట్ర తప్ప ఇందులో మరే ఉద్దేశమూ లేదని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాల ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నాయకుడిని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. నోటీసులు ఇచ్చి, వివరణ అడిగి అరెస్టు చేయాల్సి ఉండగా, ఏ పద్ధతులూ పాటించలేదని విమర్శించారు.


More Telugu News