ఈ సంక్షోభం మనకు టర్నింగ్ పాయింట్ కావాలి.. ప్రపంచమంతా మనవైపే చూస్తోంది: మోదీ

  • ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది
  • లోకల్ మాన్యుఫాక్చరింగ్ మన నినాదం కావాలి
  • ఇతర దేశాల్లో మార్కెట్ ను సృష్టించుకోవాలి
కరోనా వైరస్ తో ప్రపంచమంతా పోరాడుతోందని... మనం కరోనాతో పాటు స్వల్ప భూకంపాలు, రెండు తుపానులు, చమురు బావుల్లో మంటలు, వరదలు, వడగండ్లు, మిడతలతో కూడా పోరాడుతున్నామని ప్రధాని మోదీ చెప్పారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా బెంగాల్ లోని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ... అనేక సమస్యలపై భారత్ ఏక కాలంలో పోరాడుతోందని అన్నారు. ఈ నాటి సంక్షోభం మనకు ఒక టర్నింగ్ పాయింట్ కావాలని... సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు. ఆ టర్నింగ్ పాయింటే... సాధికార భారత్ అని  చెప్పారు.

భారతీయులు తమ సొంత ఉత్పత్తులకు, కళలకు ఇతర దేశాల్లో మార్కెట్ ను సృష్టించుకోవాలని మోదీ చెప్పారు. మనకున్న వనరులన్నింటినీ ఉయోగించుకునే అవకాశం  మనకు ఉన్నప్పుడు... భారత్ ఆత్మ నిర్భర దేశంగా ఎందుకు అవతరించదని అన్నారు. లోకల్ మాన్యుఫాక్చరింగ్ అనేది మన నినాదం కావాలని చెప్పారు. మనం తప్పనిసరిగా దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకుని, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రజలు, భూగ్రహం, లాభం ఈ మూడు ఎప్పుడూ కలిసే ఉంటాయని చెప్పారు. వీటిని విడదీయలేమని అన్నారు.

విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని.. స్వదేశీ అనేది మన నినాదం కావాలని మోదీ పిలుపునిచ్చారు. విజయం సాధించేంత వరకు మనో నిబ్బరాన్ని కోల్పోకూడదని చెప్పారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిందని... పరస్పరం సహకరించుకుంటూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొందామని చెప్పారు. ఐకమత్యమే మన బలమని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని.. మన శక్తి సామర్థ్యాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు.


More Telugu News