చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపు.. కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్

  • అధిక కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ ‘చలో సెక్రటేరియట్’
  • కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్న కోమటిరెడ్డి
వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. కరోనా సమయంలో ఇళ్ల అద్దెలు చెల్లించవద్దని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు శ్లాబుల పేరుతో ప్రజల నెత్తిన వేలాది రూపాయల బిల్లులు రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు అవసరమా? అని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంతింత కరెంటు బిల్లులు ఎలా కడతారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు నివాసాల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.


More Telugu News