హైదరాబాద్ లో తెల్లవార్లూ కురుస్తూనే ఉన్న వర్షం... పలు ప్రాంతాలు జలమయం!

  • నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలైన వర్షం
  • రాత్రి 10 గంటలకే 6 సెంటీమీటర్ల వర్షం
  • మరో రెండు, మూడు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ
హైదరాబాద్ లో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో మొదలైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, గంటల పాటు ప్రజలు నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. ఇక నిన్న రాత్రి 10 గంటల సమయానికే 6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. లోతుకుంట, హబ్సీగూడ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, మలక్ పేట, కూకట్ పల్లి, అమీర్ పేట, షేక్ పేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.

ఈ ఉదయం రహదారులపై భారీ ఎత్తున నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదిలావుండగా, మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గత రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.


More Telugu News