హైదరాబాద్ నుంచి నేడు ఒడిశాకు ఐదు శ్రామిక్ రైళ్లు

  • ఇటుక బట్టీల్లోని వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించాలంటూ పిల్
  • కార్మికుల తరలింపుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి
  • వారిని తరలించేంత వరకు ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించాలన్న ధర్మాసనం
నేడు తెలంగాణ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు ఒడిశాకు బయలుదేరనున్నాయి. వీటి ద్వారా 9,200 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి చేరుకోనున్నారు. వీరంతా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న 15,800 మందిని తరలించేందుకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వలస కార్మికులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన కార్మికుల కోసం రెగ్యులర్ రైళ్లకు అదనంగా నాలుగు బోగీలు నడపాలని సూచించింది.

అలాగే, కార్మికులను పూర్తిగా తరలించే వరకు వారికి ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, వారి రవాణా చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ  ప్రొఫెసర్‌ రామ శంకర్‌ నారాయణ్‌ మేల్కొటి, న్యాయవాది పీవీ కృష్ణయ్య, జీవన్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను నిన్న విచారించిన కోర్టు ఈ మేరకు సూచనలు చేసింది.


More Telugu News