నా వీడియో ఏ నిర్మాత లీక్‌ చేశాడో నాకు తెలుసు: ఖుష్బూ ఆగ్రహం

  • మీడియాపై ఖుష్బూ అనుచిత వ్యాఖ్యలు
  • కరోనా తప్ప ఇతర వార్తలు దొరకట్లేదని వ్యాఖ్యలు
  • వీడియో బయటకు వచ్చిన వైనం
  • ఓ నిర్మాతపై ఖుష్బూ ఆగ్రహం
సినీనటి ఖుష్బూ ఇటీవల తన స్నేహితులతో మాట్లాడుతూ మీడియాపై నెగెటివ్‌ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకి రావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఖుష్బూ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సారీ చెప్పింది. అయితే, తన వాయిస్‌ని ఎడిట్‌ చేసి వీడియో వైరల్ చేశారని కూడా ఆమె పేర్కొంది.

పాత్రికేయులకు కరోనా  వార్తలు తప్ప మరొకటి దొరకట్లేదని, ఇక షూటింగ్స్ ప్రారంభం అవుతుండడంతో జర్నలిస్టులు సినీనటులకి సంబంధించిన వార్తలని ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారని ఖుష్బూ చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. పాత్రికేయులకు అవకాశం ఇస్తే వారు సొంతంగా క‌థ‌లు అల్లి ప్రచురిస్తారని, వారికి ఫోటోలు, వీడియోలు లాంటివి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆమె వ్యాఖ్యానించింది.

దీనిపైనే ఆమె స్పందిస్తూ... మీడియా పట్ల తనకు చాలా గౌరవం ఉందన్న విషయం జర్నలిస్టులకి తెలుసని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారి గురించి అగౌరవంగా మాట్లాడలేదని చెప్పింది.

తాను ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమాపణలు తెలుపుతున్నానని పేర్కొంది. తాను చేసిన వ్యాఖ్యల క్లిప్ నిర్మాతల నుండి బయటకి వచ్చిందని అనుమానిస్తున్నామని తెలిపింది. తాను పత్రికలని అగౌరవపరచ లేదని చెప్పింది. ఏ నిర్మాత ఇలా చేశాడో తనకు తెలుసని, తాను అతడి పేరును మాత్రం బయట పెట్టనని చెప్పింది. తన మౌనమే‌ అతడికి శిక్ష అని చెప్పింది.
               



More Telugu News