మరో దారుణం: శునకం మూతికి ప్లాస్టర్.. విలవిల్లాడిన మూగజీవి!

  • కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఘటన
  • ఆహారం, నీళ్లు తీసుకోలేక అల్లాడిపోయిన శునకం
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
దేశంలో మూగజీవాలపై హింస పెచ్చుమీరుతోంది. కేరళలో ఏనుగు ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈసారి బాధితురాలిగా మారింది ఓ శునకం. త్రిసూరు జిల్లా ఒల్లూరు ప్రాంతంలో కొందరు ఆకతాయిలు శునకం మూతి చుట్టూ గట్టిగా టేపు చుట్టి వదిలేశారు.

 దీంతో అది ఆహారం తీసుకోలేక, నీళ్లు తాగలేక విలవిల్లాడిపోయింది. టేపును బలంగా చుట్టడం, దాదాపు రెండు వారాలు కావడంతో దాని మూతిపై పుండు ఏర్పడింది. బాధతో విలవిల్లాడుతున్నా కనీసం అరవలేక పోయింది. మూతికి టేపుతో దయనీయ స్థితిలో వీధుల్లో తిరుగుతున్న శునకాన్ని గుర్తించిన కొందరు ఆ టేపును తొలగించి ఆసుపత్రికి తరలించారు.

శునకం మూతిచుట్టూ అనేక పొరలతో టేపు చుట్టడంతో అది బిగుసుకుపోయి తీవ్ర గాయమైంది. టేపును తొలగించిన వెంటనే అది దాదాపు రెండు లీటర్ల నీటిని ఏకబిగువున తాగింది. శునకం మెడలో కాలర్ చుట్టి ఉండడంతో దానిని పెంపుడు జంతువుగానే భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శునకం మూతికి టేపు చుట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News