గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడి.. విధులు బహిష్కరించిన వైద్యులు!

  • చికిత్స పొందుతూ మృతి చెందిన రోగి
  • వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
  • ఆసుపత్రిలోని ఫర్నిచర్, కుర్చీలు ధ్వంసం
గాంధీ ఆసుపత్రిలో నిన్న రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగాడు. ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి (55) ఈ నెల 6న కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. అతడి బంధువు (30) ఒకరు అతడికి కేర్ టేకర్‌గా అక్కడే ఉన్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో గత రాత్రి 8 గంటల సమయంలో రోగి మరణించాడు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేని బంధువు వైద్యుల నిర్లక్ష్యమే అందుకు కారణమని ఆరోపించాడు. అక్కడితో ఆగక విధి నిర్వహణలో ఉన్న జూనియర్ వైద్యులపై దాడిచేశాడు. ఆసుపత్రిలోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు.

అతడి తీరుతో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్ వైద్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అవుట్ పోస్టు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తమపై దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న అడిషనల్‌ సీపీ చౌహాన్, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌లు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో చర్చలు జరిపినప్పటికీ విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించి తమకు న్యాయం చేసే వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.


More Telugu News