గత ఆగస్టులోనే వుహాన్ ఆసుపత్రుల వద్ద అనూహ్య రద్దీ... శాటిలైట్ చిత్రాల ఆధారంగా 'హార్వర్డ్' సంచలన అధ్యయనం!

  • డిసెంబరు కంటే ముందే చైనాలో కరోనా వైరస్ ఉందన్న హార్వర్డ్
  • శాటిలైట్ చిత్రాలు విశ్లేషించామన్న పరిశోధకులు
  • వ్యాధి లక్షణాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారని వెల్లడి
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టిందన్న విషయం తెలిసిందే. అయితే, వుహాన్ లో ఈ వైరస్ ఉనికి ఎప్పుడు మొదలైందన్న విషయంలో ఇప్పటికీ చాలామందికి అనుమానాలు కలుగుతున్నాయి. చైనా ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం డిసెంబరు అని తెలుస్తున్నా, వాస్తవానికి అంతకుముందే కరోనా కలకలం రేగిందని తెలుస్తోంది. అందుకు బలం చేకూర్చేలా హార్వర్డ్ మెడికల్ స్కూలు ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని, ఆ సమయంలో వుహాన్ నగరంలోని ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ కనిపించిందని వివరించింది. ఆసుపత్రుల పార్కింగ్ ప్లేసులు కూడా నిండిపోయాయని తెలిపింది. కొన్ని శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నామని హార్వర్డ్ పరిశోధకులు వెల్లడించారు.

అదే సమయంలో, వుహాన్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇంటర్నెట్లో దగ్గు, ఇతర అనారోగ్య లక్షణాల గురించి సెర్చ్ చేయడంలో బాగా పెరుగుదల కనిపించిందని తెలిపారు. గత సీజన్లతో పోలిస్తే ఆగస్టులో వీటిపై జరిగిన సెర్చ్ చాలా ఎక్కువ అని వివరించారు. వుహాన్ లోని హువాన్ సీ ఫుడ్ మార్కెట్లో కరోనాను గుర్తించిన సమయం కంటే ముందే ఈ వైరస్ వ్యాప్తి మొదలైందన్న వాదనలకు తమ వద్ద ఉన్న ఆధారాలు సరిపోలుతున్నాయని వివరించారు.


More Telugu News