మా నాన్న ఏడాది సంపాదనంతా నన్ను అమెరికా పంపేందుకు సరిపోయింది: సుందర్ పిచాయ్

  • గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులకు పిచాయ్ సందేశం
  • కష్టాలకు ఎదురునిలవాలని హితవు
  • అప్పుడే ఉన్నత శిఖరాలు చేరతారంటూ వివరణ
ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సెర్చింజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు సీఈవోగా సుందర్ పిచాయ్ అత్యంత కీలక బాధ్యతల్లో ఉండడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. అయితే అంతటి ఉన్నతస్థానానికి సుందర్ పిచాయ్ ఎదగడం ఆషామాషీ వ్యవహారం కాదు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.

ఇటీవల ఓ వీడియో ద్వారా తన ప్రస్థానాన్ని వివరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తన గురించి చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన రోజుల్లో తాను కూడా కష్టాలు ఎదుర్కొన్నానని, తన తండ్రి ఏడాది సంపాదనంతా అమెరికా వెళ్లేందుకు టికెట్ కొనడానికి సరిపోయిందని వివరించారు.

అమెరికా వెళ్లిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పలేదని, అక్కడ ఓ బ్యాగ్ కొనాలంటే తన తండ్రి నెల జీతం ఖర్చయ్యేదని తెలిపారు. భారత్ కు ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని, అలాంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయని పిచాయ్ పేర్కొన్నారు. అయితే, ఎంత కష్టం వచ్చినా ఎదురు నిలవాలని అప్పుడే జీవితంలో పైకి ఎదుగుతారని స్పష్టం చేశారు. చరిత్ర కూడా ఇదే విషయం చెబుతుందని అన్నారు.


More Telugu News