నిందితురాలికి కరోనా... విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారుల్లో కలకలం!

  • ఐసిస్ కుట్రల నేపథ్యంలో సమీ, బేగ్ దంపతులపై విచారణ
  • 9 రోజులుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ
  • అనుమానిత లక్షణాలు కనిపించడంతో నిందితురాలికి కరోనా పరీక్ష
ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్ లో భారీ దాడులకు కుట్రలు చేస్తోందన్న నేపథ్యంలో శ్రీనగర్ కు చెందిన జహాన్ జైబ్ సమీ, హీనా బషీర్ బేగ్ అనే దంపతులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. వీరికి ఆ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఢిల్లీలోని ఎన్ఏఐ ప్రధాన కార్యాలయంలో వీరిపై విచారణ జరుపుతున్నారు. అయితే, సమీ భార్య హీనా బషీర్ బేగ్ లో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని రావడంతో, గత 9 రోజలుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారుల్లో కలవరం మొదలైంది.

హీనా బషీర్ బేగ్ కేసు విచారిస్తున్న అధికారులందరూ క్వారంటైన్ కు వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఆదేశించారు. అటు, కరోనా బారినపడిన హీనాను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించనున్నారు. హీనాకు కరోనా పాజిటివ్ వచ్చినా ఆమె భర్త సమీలో ఎలాంటి అనుమానిత లక్షణాలు లేవని గుర్తించారు.


More Telugu News