ఉక్కు సంకల్పంతో క‌రోనాను జయించిన న్యూజిలాండ్‌.. చిట్టచివరి కరోనా రోగి డిశ్చార్జ్‌

  • ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్
  • ఆంక్షల సడలింపుపై సమాలోచనలు
  • లాక్‌డౌన్‌ను  కఠినంగా అమలుచేసిన న్యూజిలాండ్
  • మాంద్యంలోకి కూరుకుపోయినప్పటికీ కరోనా నియంత్రణపైనే దృష్టి
కరోనాను అరికట్టడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ విషయంలో చైనా మినహా ఏ దేశానికి దక్కని ఘనత న్యూజిలాండ్‌కు దక్కింది. తమ దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్‌ బాధిత మహిళ కోలుకుందని ఆ దేశ ప్రధాని  జసిండా అర్డెర్న్ ప్రకటన చేశారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన ఆ క‌రోనా బాధిత మ‌హిళ సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు.

దీంతో న్యూజిలాండ్‌లో ఆంక్షల  సడలింపును ప్రకటించవచ్చ‌ని తెలుస్తోంది. న్యూజిలాండ్‌ నుంచి కరోనాను తరిమికొట్టినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌ను  కఠినంగా అమలుచేశారు. అత్యవసర, నిత్యావసరాలకు మాత్రమే బయటకు రావాలని, అదీ పూర్తి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

న్యూజిలాండ్‌ ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయినప్పటికీ ఆ దేశ ప్రధాని కరోనా వైరస్‌ను తరిమేయడమే ముఖ్యమని భావించారు. కరోనాను అరికట్టాక మళ్లీ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామని ఆమె అన్నారు. ఉక్కు సంకల్పంతో కరోనాను జయించిన న్యూజిలాండ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.


More Telugu News