విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు... పూర్తి వివరాలు ఇవిగో!

  • అందాన్ని ఎరగా వేసి అమ్మాయితో వ్యభిచారం
  • డబ్బు వద్ద తేడాలు రావడంతో హత్య
  • శవాన్ని తరలించే ప్రయత్నంలో దొరికిపోయిన నిందితులు
విశాఖపట్నంలో దివ్య అనే అమ్మాయి అత్యంత దయనీయ పరిస్థితుల్లో కడతేరిపోవడం సంచలనం సృష్టించింది. ఆమె అందాన్ని ఎరగా వేసి వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠానే అమెను అంతమొందించింది. కేవలం అట్లకాడలతో వాతలు పెట్టి, చపాతీ కర్రతో కొట్టి ఆమెను చంపారంటే ఎంత పాశవికంగా హింసించి ఉంటారో ఊహించవచ్చు.

దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. ఆరేళ్ల కిందట అమ్మమ్మ, తల్లిదండ్రులను కోల్పోయింది. ఓ రౌడీషీటర్ వారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. దాంతో పిన్ని క్రాంతివేణి సంరక్షణలో పెరిగింది. అయితే ఉపాధి కోసం విశాఖలోని వసంత వద్ద పనిలో కుదిరింది. కానీ వసంత... దివ్య అందాన్ని ఎరగా వేసి వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది. తన వాటా తనకు ఇవ్వాల్సిందేనని దివ్య పట్టుబడుతుండడం వసంతకు కంటగింపుగా మారింది.

దాంతో ఆమెను ఎలాగైనా దారిలోకి తేవాలని, మాట వినకుంటే అంతమొందించాలని నిశ్చయించుకుని భోజనం పెట్టకుండా ఇంట్లో బంధించింది. దివ్యకు గుండు గీయడమే కాదు, కనుబొమ్మలు సైతం తీసేశారు. అట్లకాడతో వాతలు పెట్టడం, రోజూ చపాతీ కర్రతో కొట్టడం... ఇలా బతికుండగానే నరకం చూపారు. వసంత ముఠా పెట్టే హింస తట్టుకోలేక దివ్య ప్రాణాలు విడిచింది. దివ్య కరోనాతో చనిపోయిందని చుట్టు పక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసిన వసంత... మృతదేహాన్ని తరలించే విషయంలో దొరికిపోయింది.

ఓ అంతిమయాత్ర వాహనం డ్రైవర్ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయగా, అతడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయింది. ఎంత కావాలన్నా ఇస్తామనడంతో అతడు భయపడి పోలీసులకు చెప్పేశాడు. వసంతను, ఆమె ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మొత్తం చెప్పేశారు.

వసంతతో పాటు దివ్య పిన్ని క్రాంతివేణి, గీత, ధనలక్ష్మి, సంజయ్ మంజులను అరెస్ట్ చేశారు. ఇక, దివ్య మృతదేహానికి విశాఖ కేజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించగా ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా, నిందితులపై అక్రమ రవాణా యాక్ట్ 201తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిని త్వరలోనే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.


More Telugu News