అందుకే ప్రియాంకగాంధీ పేరును మార్చాం: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం

  • ప్రియాంకను మీడియా జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తుంది
  • అమేథీలో సొంత సోదరుడిని గెలిపించుకోలేకపోయారు
  • ఆమె ట్వీట్ చేస్తే మీడియా చాలా బిజీ అయిపోతుంది
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకను సోషల్ మీడియా ఒక గొప్ప జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోందని... వాస్తవానికి ఆమెకు అంత సీన్ లేదని అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీని అమేథీ నుంచి గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

ఆమెను తాను ఎప్పుడూ  సీరియస్ గా పరిగణించలేదని చెప్పారు. ఆమెకు 'ప్రియాంక ట్విట్టర్ వాద్రా'గా తాము ఎప్పుడో నామకరణం చేశామని తెలిపారు. రెండు, మూడు రోజులు ఆమె ట్వీట్ చేస్తారని... ఆ ట్వీట్లతో మీడియా చాలా బిజీ అయిపోతుందని, సోషల్ మీడియా ఆమెను జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తుందని ఎద్దేవా చేశారు.

సోదరుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు గాను గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఆమె ప్రచారం చేశారనే విషయం అందరికీ తెలుసని కేశవ్ ప్రసాద్ అన్నారు. అయితే రాహుల్ విజయాన్ని ఆమె సాధించలేక పోయారని చెప్పారు. గత పార్లమెంటు ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బేస్ కోల్పోయిందని కేశవ్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి సరైన నాయకుడు కూడా లేరని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆమె నెగెటివ్ యాంగిల్ లోనే చూస్తుంటారని... అందుకే రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఆమెకు అర్థం కావని అన్నారు. వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలపై ప్రియాంక చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ... మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో కాంగ్రెస్ కు కనపడదని... అది ఆ పార్టీకి ఉన్న దృష్టి దోషమని ఎద్దేవా చేశారు.


More Telugu News