జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు లారీ డ్రైవర్ల ఆందోళన... అధికార పక్షం పనే అంటున్న జేసీ కుటుంబం

  • తమ లారీల ఇంజిన్ నెంబర్లు అక్రమంగా వాడుకున్నారంటూ ఆరోపణలు
  • తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణమయ్యారని ఆగ్రహం
  • లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ రోజు అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట లారీ డ్రైవర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లు అక్రమంగా వాడుకున్నారని, తద్వారా తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారని ఆరోపిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.

అంతేకాదు, జేపీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3 లారీలను బీఎస్-4 లారీలుగా మార్చి తమకు విక్రయించారని మండిపడ్డారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై జేసీ కుటుంబ సభ్యులు స్పందిస్తూ, ఈ ఆందోళనల వెనుక అధికార పక్షం ఉందని ఆరోపించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపైనా, మరో నలుగురు వ్యక్తులపైనా కేసు నమోదు చేసినట్టు సమాచారం.


More Telugu News