పాత పథకాలకే వైసీపీ కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తోంది: ధూళిపాళ్ల నరేంద్ర

  • గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు
  • లబ్దిదారుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపణలు
  • రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరుగుతోందని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక పథకాల్లో లబ్దిదారుల సంఖ్యను భారీగా తగ్గించిందని అన్నారు. ప్రచారం ఇష్టం లేదంటూనే పథకాల ప్రచారంపై భారీగా ఖర్చు పెడుతున్నారని, గోరంత పని చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 6 లక్షల ఆటోలుంటే 2 లక్షల ఆటో యజమానులకే సాయం చేశారని తెలిపారు.

ఉపకార వేతనాలకే జగనన్న వసతి, దీవెన అంటూ పేర్లు పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు దోచిపెడుతున్నారని, మంచి కాలేజీలకు తక్కువ రుసుం చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల పేరుతో అయినవాళ్లకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళ ఖాతాలో రూ.15 వేలు వేస్తామన్నారు, ఇప్పటివరకు వేయలేదని ధూళిపాళ్ల విమర్శించారు. అటు, మద్యం విషయంలోనూ రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని, అధికార పార్టీ నేతలే లిక్కర్ మాఫియాలో భాగస్వాములు అని ఆరోపించారు.


More Telugu News