పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది: భారత్‌

  • అఫ్ఘాన్‌లోని ఉగ్రమూకల్లో 6,500 మంది పాక్‌కు చెందినవారు 
  • భద్రతా మండలి నివేదికలో స్పష్టం
  • నివేదికలోని అంశాలను భారత్‌ వక్రీకరిస్తోందన్న పాకిస్థాన్‌
  • తమ దేశంలో ఉగ్రవాదులున్నారని పాక్‌ ప్రధాని కూడా చెప్పారన్న భారత్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ నిజస్వరూపాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన నివేదిక ద్వారా కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని భారత్‌ తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌లోని ఉగ్రమూకల్లో సుమారు 6,500 మంది పాక్‌కు చెందినవారు ఉన్నారని ఇటీవల భద్రతా మండలి తన నివేదికలో పేర్కొంది.

జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ఉగ్రవాదులను పంపే ప్రక్రియలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరుపుతున్నాయని చెప్పింది. అయితే, ఈ నివేదికలోని అంశాలను భారత్‌ వక్రీకరిస్తోందంటూ పాకిస్థాన్‌ అధికారి ఒకరు పలు వ్యాఖ్యలు చేశారు.

పాక్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. గత ఏడాది ఓ సారి తమ దేశంలో ఉగ్రవాదులున్నారన్న విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేసింది. 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు పాక్‌లో ఉన్నారని ఆయన చెప్పారని  భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

ఇమ్రాన్ అంగీకరించిన విషయాన్నే భద్రతా మండలి నివేదికలో ప్రస్తావించారని చెప్పారు. ఆ నివేదికపై నిందలు వేస్తూ ఆరోపణలు చేసే బదులు ఆత్మవిమర్శ చేసుకోవాలని పాక్‌కు ఆయన చెప్పారు. పాక్‌ ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని ఆయన అన్నారు.


More Telugu News