అబద్ధమాడటం అన్నది కాంగ్రెస్ జన్యువులోనే ఉంది: యోగి ఆదిత్యనాథ్

  • యూపీ ప్రభుత్వంపై రాహుల్, ప్రియాంక విమర్శలు
  • వారి మాట వింటే ఇండియా కూడా ఇటలీ అవుతుంది
  • దశాబ్దాల కాలంలో ఒక అజెండాను కూడా రూపొందించుకోలేకపోయారు
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో యూపీలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్, ప్రియాంకలు చేసిన విమర్శలపై యోగి మండిపడ్డారు. వారి మాటలను వింటే ఇండియా కూడా ఇటలీ అవుతుందని అన్నారు. ఇండియాను ఇండియాలాగే ఉంచాలని సలహా ఇచ్చారు.  

దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని... అయినప్పటికీ ఒక అజెండాను కానీ, ప్రజల కోసం ఒక విజన్ ను కానీ రూపొందించడంలో తీవ్రంగా విఫలమైందని యోగి విమర్శించారు. కరోనా తొలి కేసు బయటపడే సమయానికి దేశంలో ఒకే ఒక కరోనా ల్యాబ్ అందుబాటులో ఉందని... ఇప్పుడు 650 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, రోజుకు 2 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా విమర్శలు చేయడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని అన్నారు.

అబద్ధమాడటం కాంగ్రెస్ జన్యువులోనే ఉందని దుయ్యబట్టారు. వలస కార్మికుల కోసం బస్సులను పంపుతామని వారు అన్నారని, దానికి తాము కూడా అంగీకరించామని, అయితే వారు బస్సులను పంపలేదని విమర్శించారు. పంపిన కొన్ని బస్సులకు సరైన పత్రాలు, ఇన్స్యూరెన్స్, రిజిస్ట్రేషన్ కూడా లేవని అన్నారు.


More Telugu News