మహమ్మారి విశ్వరూపం... రెండు వారాల్లో టాప్-4కు భారత్!

  • కేసుల సంఖ్యలో తొలి స్థానంలో అమెరికా
  • ఇండియాలో టెస్టుల సంఖ్య చాలా తక్కువ
  • ప్రస్తుతం ప్రతి 15 రోజులకూ రెట్టింపవుతున్న కేసులు
  • ఈ నెల 20కి ఇండియాలో 4 లక్షలకు పైగా కేసులు
  • హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
ప్రస్తుతం ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో ఏడవ స్థానంలో ఉన్న భారత్, మరో రెండు వారాల్లో... అంటే జూన్ నెల మధ్యలోనే టాప్-4కు చేరే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ప్రకారం పరిశీలిస్తే, ఈ వారంలోనే మనకన్నా ముందున్న ఇటలీ, స్పెయిన్ లను అధిగమిస్తుందని, ఆపై మరికొన్ని రోజుల్లోనే యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో తొలి స్థానంలో అమెరికా కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం అమెరికాలో కేసుల పెరుగుదల నిదానించింది. యూరప్ దేశాల్లో సైతం నూతన కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇండియాలో ప్రస్తుతం ప్రతి 15 రోజులకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అంటే, ప్రస్తుతమున్న కేసుల సంఖ్య 2.16 లక్షల కేసులు, ఈ నెల 20వ తేదీకి సుమారు 4 లక్షలను దాటిపోతాయి. ఆపై మరో రెండు వారాల్లో కేసుల సంఖ్య 8 లక్షలకు చేరుతుంది.

ఇదిలావుండగా, ఇండియాలో టెస్టుల సంఖ్యను పెంచితే, వాస్తవ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో ప్రతి 10 లక్షల మందిలో 80 మందికి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. ఆ లెక్కలోనే 130 కోట్లకు పైగా ప్రజలున్న భారతావనిలో నిత్యమూ దాదాపు 10 వేల కేసులు వస్తున్నాయి. ఇక, రష్యా మాదిరిగా ప్రతి 10 లక్షల మందిలో 2 వేల మందికి పరీక్షలు చేస్తే, ఇండియాలో కేసుల సంఖ్య ఊహించడానికే భయంకరంగా ఉంటుందన్నది వాస్తవం.


More Telugu News