ఈసారి వలస కార్మికుల కోసం మూడు రైళ్లు ఏర్పాటు చేసిన సోనూ సూద్!

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు 
  • సొంత గ్రామాలకు పంపేందుకు మూడు రైళ్లు బుక్‌చేసిన సోను
  • ఓ టోల్‌ఫ్రీ నంబర్ కూడా‌ ఏర్పాటు
  • తనకు మద్దతు తెలుపుతోన్న వారికి సోను థ్యాంక్స్
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సాయం చేస్తూ సినీనటుడు సోనూ సూద్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. వలస కార్మికులందరూ తమ ఇళ్లకు వెళ్లే వరకు సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా వారి కోసం మూడు రైళ్లు బుక్‌ చేసి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.

బీహార్‌, యూపీ నుంచి ఉపాధి కోసం ముంబైకి వచ్చి ఉంటున్న వలస కార్మికులను తమ ఇళ్లకు చేర్చేందుకు ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. తాను తొలిసారి కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి, ముంబై నుంచి కర్ణాటకకు పంపినప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయని చెప్పారు. కాల్స్ బాగా వస్తుండడంతో కొన్ని కాల్స్‌, మెస్సేజ్‌లను మిస్సయ్యానని చెప్పారు.

అందరికీ అందుబాటులో ఉండేలా తాను ఇటీవల ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశానని తెలిపారు. ఒకేసారి చాలా మందిని పంపించడానికే రైళ్లను బుక్ చేసినట్లు తెలిపారు. తాను చేస్తోన్న ఈ పనికి మద్దతు తెలుపుతూ సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News