కరోనా విషయంలో భారత్‌ పొరపాటు చేసింది: రాహుల్‌తో రాజీవ్ బజాజ్

  • యూఎస్‌, ఫ్రాన్స్‌, యూకే వంటి దేశాలవైపు భారత్‌ చూసింది
  • అక్కడి వ్యవస్థ మన దేశానికి ఏ విధంగానూ సరిపోలదు
  • దేశంలో వైద్యరంగం సమర్థవంతంగా లేదు
  • తూర్పు దేశాలు చక్కగా కరోనాను కట్టడిచేశాయి
కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ వల్ల కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా‌ సంక్షోభాన్ని ఎదుర్కునే విషయంలో భారత్ యూఎస్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, యూకే వంటి దేశాలవైపు చూసి పొరపాటు చేసిందని రాజీవ్ బజాజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే అక్కడి వ్యవస్థలు మన దేశానికి ఏ విధంగానూ సరిపోలవని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనాను ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవన్న విషయాన్ని భారత్ గుర్తించాలని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలను ప్రస్తావిస్తుంటే దేశంలో ప్రతిఒక్కరు భయపడి జాగ్రత్తలు తీసుకుంటారన్న ఉద్దేశంతో భారత్ వ్యవహరించిందని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

అయితే, తూర్పు దేశాలు వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేశాయని ఆయన చెప్పారు. ఆ దేశాల స్పందనను భారత్‌ గమనించాలని ఆయన చెప్పారు. ధనవంతులు, సెలబ్రిటీలు రోగాల‌ బారిన పడితే అది పెద్ద విషయం అవుతుందని, ఆఫ్రికాలో ప్రతిరోజు 8 వేల మంది పిల్లలు ఆకలితో మరణిస్తే మాత్రం దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆయన చెప్పారు.

కాగా, ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఈ విధంగా ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వినాశకరమైన పరిస్థితి దాపురించిందని చెప్పారు.


More Telugu News