ఉద్యోగులను ఆఫీసులకి పిలిచే క్రమంలో తొందరలేదంటోన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. ప్రణాళికలు సిద్ధం

  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఐటీ కంపెనీలు
  • క్రమంగా ఉద్యోగులను పెంచుకుంటామని వ్యాఖ్య
  • ఆఫీసుల నుంచి పనిచేస్తోన్న 15 శాతం ఇన్ఫోసిస్ ఉద్యోగులు
  • వ్యాక్సిన్‌ వచ్చే వరకు 50 శాతం ఉద్యోగులనే రమ్మంటామన్న  హెక్సావేర్‌
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో తమ ఉద్యోగులతో తిరిగి కార్యాలయాల్లోనే పని చేయించాలన్న తొందర తమకేమీలేదని ఐటీ సంస్థలు అంటున్నాయి.

కరోనా తీవ్రత పరిస్థితుల పరిణామాలను ఇప్పటికే తమ క్లయింట్లకు వివరించాయి. తొందరపడకుండా తమ ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలుస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో పనిచేస్తున్నారని చెప్పింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులను తిరిగి తెరిచే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని, వారి రక్షణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. అలాగే, క్లయింట్లకు మంచి సర్వీసును అందిస్తామని వివరించారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు ఒక్కరు కూడా కార్యాలయాల నుంచి పనిచేయట్లేదని హెక్సావేర్‌ టెక్నాలజీస్ తెలిపింది.

ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేసుకోవచ్చన్న ప్రభుత్వ పాలసీకి సంబంధం లేకుండా ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ కంపెనీ సీఈవో శ్రీకృష్ణ తెలిపారు. తమ పాలసీకి అనుగుణంగా ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.

కరోనా తీవ్రతను బట్టి భవిష్యత్తులో అన్ని కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు వేసుకుంటామని ఆ సంస్థ తెలిపింది. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతోనే పనులు చేయించాలని ఆ సంస్థ భావిస్తోంది.

ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీకి చెందిన 4 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. విప్రోకు చెందిన 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. తొలిదశలో 10 శాతం మందిని ఆఫీసుల నుంచి పనిచేయించాలని భావిస్తోంది.

ఉద్యోగులకు ఆఫీసుల నుంచి పని చేయించే విషయంపై టెక్‌ మహీంద్రా కూడా ప్రణాళికలు వేసుకుంటోంది. తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తోన్న యూఎస్‌టీ గ్లోబల్‌ 10 శాతం ఉద్యోగులతో కార్యాలయాల నుంచి పనిచేస్తోంది.


More Telugu News