వ్యవసాయ భూమిలో లభ్యమైన రాగిపాత్రలు, వెండి ఆభరణాలు

  • వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఘటన
  • ఇల్లు కోసం మట్టి తవ్వుతుండగా బయటపడిన పాత్రలు
  • 832 గ్రాముల వెండి, మూడు రాగి,రెండు ఇత్తడి పాత్రలు స్వాధీనం
వికారాబాద్ జిల్లా పరిగి మునిసిపాలిటీలోని సుల్తాన్‌నగర్‌లో ఓ వ్యవసాయ భూమిలో రాగి పాత్రలు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

గ్రామానికి చెందిన సిద్దిఖీ ఇల్లు కట్టుకునేందుకు మంగళవారం తన వ్యవసాయ భూమిలో మట్టిని తవ్వుతుండగా మూడు రాగి, రెండు ఇత్తడి పాత్రలు బయటపడ్డాయి. వాటిలో కొన్ని వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన సిద్ధిఖీ.. పక్క పొలంలోని ఇద్దరితో కలిసి వాటిని సమానంగా పంచుకున్నాడు.

అయితే, విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరికి రెవెన్యూ అధికారులకు చేరింది. స్పందించిన తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సై శ్రీశైలం గ్రామాన్ని సందర్శించి సిద్ధిఖీ, ఇతరుల నుంచి రాగి, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న వాటిలో 832 గ్రాముల వెండి, మూడు రాగిపాత్రలు, రెండు ఇత్తడి పాత్రలు ఉన్నట్టు తహసీల్దార్ తెలిపారు.


More Telugu News