చైనాపై దూకుడు పెంచిన అమెరికా.. డ్రాగన్ విమానాలకు అమెరికాలో నో ఎంట్రీ!

  • చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థలపై నిషేధం
  • ఈ ఏడాది మొదట్లో వుహాన్ ప్రావిన్స్‌కు విమానాలు నిలిపివేసిన అమెరికా
  • చైనా నిబంధనలు ఉల్లంఘించిందన్న యూఎస్
డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను అధ్యక్షుడు ట్రంప్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

 కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి చైనాను తప్పుబడుతున్న అమెరికా.. హాంకాంగ్‌పై చైనా వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనాపై ఆంక్షలు తప్పవని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు జోరు పెంచారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో వుహాన్‌ ప్రావిన్స్‌కు అమెరికా తన విమానాలను నిలిపివేసింది. అయితే, ఈ నెల 1 నుంచి విమానాలు నడిపేందుకు అమెరికా విమానయాన సంస్థలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సిద్ధమైనప్పటికీ చైనా అనుమతులు మంజూరు చేయలేదు.

ఫలితంగా అమెరికా ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలపై జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. చైనా ప్రభుత్వం ఎన్ని అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతిస్తుందో, అన్నే విమానాలను తాము కూడా అమెరికాలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.


More Telugu News