ముంబై విమానాశ్రయం రన్‌వేపై జారిన ఫెడెక్స్ విమానం.. తప్పిన ముప్పు

  • నిసర్గ తుపాను కారణంగా ప్రతికూలంగా వాతావరణం
  • ఏడు గంటల వరకు నిలిచిపోయిన విమాన రాకపోకలు
  • రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరం దాటిన నిసర్గ
ముంబై విమానాశ్రయంలోని రన్‌వేపై ఓ సరుకు రవాణా విమానం జారిపోయింది. అయితే, ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిసర్గ తుపాను కారణంగా ముంబైలో ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉంది.

ఈ క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన ఫెడెక్స్ విమానం రన్‌వేపై ఒక్కసారిగా జారిపోయింది. తుపాను కారణంగా వీస్తున్న ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం వల్ల ఇతర కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగలేదని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

కాగా, ఈ ఘటన తర్వాత సాయంత్రం ఏడు గంటల వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిషేధించారు. కాగా, ఈ మధ్యాహ్నం నిసర్గ తుపాను రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరం దాటింది. తీరం దాటినప్పుడు తుపాను బలహీనపడడంతో ముంబైకి పెను ముప్పు తప్పింది.


More Telugu News