చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన సంచయిత గజపతిరాజు

  • రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న మాన్సాస్ ట్రస్ట్
  • అశోక్ గజపతిరాజు ఆశయాన్ని బతికించాలన్న చంద్రబాబు
  • మాన్సాస్ అధ్యక్షురాలిని నేనే అనే విషయాన్ని తెలుసుకోవాలన్న సంచయిత 
పూసపాటి వంశీయులు ఉన్నతమైన లక్ష్యాలతో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని, లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ పెద్దలు కన్నేశారని, తన తండ్రి ఆశయాలను బతికించుకోవడానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారని, ఆయన పవిత్ర సంకల్పాన్ని అందరూ బతికించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

చంద్రబాబు వ్యాఖ్యలకు అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తె, ప్రస్తుత మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షురాలు సంచయిత గజపతిరాజు సమాధానమిచ్చారు. ఆనంద గజపతిరాజు పెద్ద బిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్ బాధ్యతలను తాను చేపట్టాననే విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలని ఆమె అన్నారు. మా తండ్రి చితి ఆరకముందే మా బాబాయ్ అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా మీరు జీవో జారీ చేశారని అన్నారు.

అశోక్ గజపతిరాజు పదవీకాలంలో ఉండగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ట్రస్ట్ ఆర్థికంగా నష్టపోయిందని, విద్యా సంస్థల్లో నాణ్యత పడిపోయిందని అన్నారు. ట్రస్టు భూములు పరులపాలు అవుతుంటే కనీసం లాయర్ ను కూడా నియమించలేదని చెప్పారు. దీనికి విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పే ఉదాహరణ అని అన్నారు.

మాన్సాస్ లా కాలేజి క్యాంపస్ ను ఐఎల్ఎఫ్ఎస్ కు ఉచితంగా ఇచ్చేశారని, విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారని సంచయిత ఆరోపించారు. చివరకు ఐఎల్ఎఫ్ఎస్ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబుగారు తన సహచరుడిని పొగిడే ముందు... తమ తాతగారు, తమ తండ్రిగారి వారసత్వాన్ని ఆయన ఏ విధంగా ధ్వంసం చేశారో తెలుసుకోవాలని సూచించారు. వాస్తవం ఏమిటంటే... ఇవన్నీ మీ ఇద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెపుతున్నారంటూ తీవ్ర ఆమె వ్యాఖ్యలు చేశారు.


More Telugu News