అసలు జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు?

  • రెస్టారెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఫ్లాయిడ్
  • ఓ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మెడపై మోకాలితో తొక్కిపట్టిన అధికారి
  • చంపవద్దంటూ వేడుకుంటూ కన్నుమూసిన ఫ్లాయిడ్
  • అమెరికా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ దేశంలో జాతి వివక్ష ఉందని ఆరోపిస్తూ, కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమలోని ఆగ్రహాన్ని తెలుపుతున్న వేళ, ప్రజల నిరసనలను అరికట్టలేకపోతున్న యూఎస్, ఇప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అతను ఏం చేస్తే, పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాలను పరిశీలిస్తే...

మిన్నెపోలిస్ నివాసి అయిన జార్జ్ ఫ్లాయిడ్ వయసు 46 సంవత్సరాలు. లాటిన్ అమెరికా రెస్టారెంట్ 'కొంగా లాటిన్ బిస్ట్రో'లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. 'స్టార్ ట్రిబ్యూన్' ప్రత్యేక కథనం ప్రకారం, ఐదేళ్ల పాటు ఆ రెస్టారెంట్ లో పని చేసిన ఫ్లాయిడ్, అదే రెస్టారెంట్ యజమాని జొవన్నీ థన్ స్ట్రామ్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అతనికి 'జెంటిల్ జెయింట్' అన్న ముద్దుపేరు కూడా ఉంది.

నిత్యమూ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లను నవ్వుతూ ఆహ్వానిస్తూ, వారితో ఫ్లాయిడ్ కలివిడిగా ఉంటుండేవాడు. ఫ్లాయిడ్ కు గియన్నా అనే ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. తాను ఎప్పుడు రెస్టారెంట్ కు వెళ్లినా ఫ్లాయిడ్ ఆలింగనం చేసుకుని ఆహ్వానించేవాడని జెస్సీ జెండిజాస్ అనే కస్టమర్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపాడు. కస్టమర్లను ప్రేమగా లోనికి పిలవడంలో ముందుండే వాడని పేర్కొన్నాడు.
ఇక అతని అరెస్ట్ విషయానికి వస్తే... మే 25న మిన్నెపోలిస్ పోలీస్ విభాగానికి ఓ కాల్ వచ్చింది. ఫ్లాయిడ్ ఓ ఫోర్జరీ చెక్ ను ఇచ్చాడని ఓ గ్రోసరీ యజమాని నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్లాయిడ్ కోసం వెతుకుతుండగా, అతను ఓ కారులో కనిపించాడు. ఆ వెంటనే పోలీసులు ఆ కారుని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఫ్లాయిడ్ మద్యం లేదా డ్రగ్స్ తీసుకుని వుండడంతో, పోలీసు అధికారులతో గొడవకు దిగాడు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం, 'నేను ఊపిరి పీల్చుకోలేకున్నాను' అని పదేపదే ఫ్లాయిడ్ వాపోతున్నా, వినని పోలీసు అధికారి ఒకరు, అతని మెడపై తన మోకాలిని బలంగా తన్నిపట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ చేతులను వెనక్కు విరిచి బేడీలు వేయడంతో పాటు, అతన్ని కింద పడేసి తొక్కిపట్టారు. "నన్ను చంపవద్దు" అని అతను వేడుకున్నా పోలీసులు వినలేదు. చివరకు అతని కళ్లు మూతలు పడ్డాయి.

ఇక అతను తమ వాడే అని తెలియకుండానే ఆ వీడియోను చూసిన ఫ్లాయిడ్ బంధుమిత్రులు, ఆపై విషయాన్ని ఇతరులకు తెలియజేయడంతో నిరసనలు మొదలై, దేశమంతా వ్యాపించాయి. ఫ్లాయిడ్ పోస్టుమార్టం నివేదికలో అతని మరణానికి పోలీసుల చర్యతో పాటు, అతని అనారోగ్యం కూడా మరణానికి కారణమని వెల్లడించింది.

కాగా, ఈ మొత్తం ఘటనలో నలుగురు పోలీసు అధికారులు ఇన్వాల్వ్ కాగా, వారిలో డెరిక్ చువావిన్, టౌ థావోలపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ఫ్లాయిడ్ మెడపై దాదాపు ఎనిమిది నిమిషాల పాటు చువాన్ తన మోకాలిని అదిమి పెట్టి ఉంచినట్టు వీడియోలు స్పష్టం చేస్తుండగా, అతనిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఫ్లాయిడ్ ఫ్యామిలీ ఇద్దరు పోలీసు అధికారుల అరెస్ట్ ను స్వాగతిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మొత్తం ఘటనను చూస్తుండిపోయిన ఇతర అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు డిమాండ్ చేస్తోంది.


More Telugu News