ట్రంప్ తో మోదీ ఫోన్ కాల్ సంభాషణ... జీ-7 సమావేశాలకు ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు

  • అనేక అంశాలపై చర్చించుకున్న మోదీ, ట్రంప్
  • ట్రంప్ దూరదృష్టి అమోఘమంటూ కొనియాడిన మోదీ
  • డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరమన్న ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ముఖ్యంగా జీ-7 గ్రూప్ విస్తరణ, భారత్ వంటి దేశాలకు సభ్యత్వం, కరోనా అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. జీ-7 గ్రూప్ లో భారత్ తో పాటు పలు దేశాలకు స్థానం కల్పించడంపై తాను ఆసక్తితో ఉన్నట్టు ట్రంప్ ప్రధాని మోదీకి తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ అమెరికా అధినేత ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జీ-7 గ్రూప్ ను మరింతగా విస్తరించాలన్న మీ దూరదృష్టి అమోఘమని ట్రంప్ ను కొనియాడారు. ఈ క్రమంలో అమెరికా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎంతో సంతోషిస్తుందని తెలిపారు.

అంతేకాదు, తాజాగా జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికాలో కల్లోల భరిత పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం లభించాలని ఆశిస్తున్నట్టు ట్రంప్ తో చెప్పారు. మోదీ, ట్రంప్ సంభాషణలో చైనా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. చైనాతో సరిహద్దు వద్ద ఏర్పడిన పరిస్థితులను ట్రంప్ ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు. ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపైనా దేశాధినేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పినట్టు తెలిసింది.


More Telugu News