వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని దుస్థితి ఏర్పడింది!: చంద్రబాబు

  • చేతకాని పాలకులుంటే నవ్వులపాలేనన్న చంద్రబాబు
  • పెట్టుబడిదారులను తరిమేస్తున్నారంటూ ఆరోపణ
  • ఏపీని వేధింపులకు వేదికగా మార్చారని వెల్లడి
రాష్ట్ర పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చేతకాని పాలన కారణంగా దేశ విదేశాల్లో తెలుగువారు నవ్వులపాలవుతున్నారని పేర్కొన్నారు. విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఏపీ తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా ఎదిగిందని, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారి దేశంలోనే నెంబర్ వన్ అయిందని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి 667 అవార్డులు వచ్చాయని వివరించారు.

అయితే, రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, రాష్ట్రానికి మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి చర్యలతో పరిస్థితి దిగజార్చారని పేర్కొన్నారు. గతంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎవరైనా ఏపీని చూపించేవారని, కానీ వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని పరస్థితి ఏర్పడిందని విమర్శించారు. వాటాల కోసం బెదిరించి పెట్టుబడిదారులను తరిమేశారని, దావోస్ సదస్సులో ఏపీ ఎప్పుడూ ప్రధానాకర్షణగా ఉండేదని, అలాంటి  ఏపీని వేధింపులకు వేదికగా మార్చిన ఘనత వైసీపీ పాలకులదేనని ఆరోపించారు. పాలకులు బాధ్యతగా ప్రవర్తించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇలాంటి చేతకాని పాలకులుంటే రాష్ట్రం నవ్వులపాలేనంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

అటు, నారా లోకేశ్ కూడా రాష్ట్ర పరిస్థితిపై వ్యాఖ్యానించారు. ప్రిజనరీ దెబ్బకు రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయిందని ట్వీట్ చేశారు. మూడు ముక్కల రాజధాని వంటి తుగ్లక్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు పారిపోయేలా చేశారని విమర్శించారు. పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడేలా చేశారని, లులూ, అదానీ వంటి సంస్థలను బెదిరించి వెనక్కి పంపి యువత భవితపై దెబ్బకొట్టారని మండిపడ్డారు.


More Telugu News