ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరయ్యే స్తోమత లేక కేరళ బాలిక ఆత్మహత్య

  • 9వ తరగతి చదువుతున్న బాలిక
  • క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంకు సాధించే విద్యార్థిని మనస్తాపం
  • ఇంట్లోంచి వెళ్లి విగతజీవిగా కనపడ్డ వైనం
లాక్‌డౌన్‌ వల్ల పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పూట గడవడానికే ఇబ్బందులు పడే పేద విద్యార్థులు ఆన్‌లౌన్‌ క్లాసుల సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడానికి తన వద్ద టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఓ విద్యార్థిని (14) ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో చోటు చేసుకుంది.
 
తాను ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నానన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక. అనంతరం వాలంచెరిలోని ఇంటి సమీపంలో ఆమె విగతజీవిగా కనపడింది. ఆమె మృతదేహం పక్కనే  కిరోసిన్ సీసా‌ కూడా ఉంది. పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్థానిక పాఠశాలలో  9 వ తరగతి చదువుతోందని తెలిపారు. తరగతిలో ఆ విద్యార్థిని ఎ‍ప్పుడూ ఫస్ట్‌ వచ్చేదని చెప్పారు.

కాగా, ఆ బాలిక మరణం తనను కలచి వేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన నియోజకవర్గంలో టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో లేని కుటుంబాలకు తాను వాటిని అందిస్తానని ప్రకటించారు. ఇటువంటి వారి జాబితాను ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.


More Telugu News